మానాన్నగారంటే చదవడం...రాయడం...



మానాన్నగారు కీర్తిశేషులు శ్రీ అద్దంకికేశవరావు గారు (
జననం:8.9.1918 - మరణం:22.11.2005)  బహుభాషావేత్త, బహుముఖప్రజ్ఞాశాలి, పద్యకవినవలారచయిత, పాటలరచయిత, వ్యాసకర్త, స్కౌటుపుస్తకాలరచయిత, నాటకకర్త మరియు  సంగీతజ్ఞుడు.
 ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా, జిల్లా స్కౌటాఫీసరుగా పనిచేస్తూ, ఏడుగురు సంతానాన్ని చదివిస్తూ, అనేక గ్రంథాలు చదువుతూ , స్వయంగా అనేకరచనలు చేసారు. ఎన్నివ్రాసినా ఉద్యోగంలో ఉండగా ఆయన మొదట 1967లో ముద్రించిన అతిచిన్ని పుస్తకం 16 పేజీలతో స్కౌటు గైడు గీతములు. అంతే.  1973లో ఉద్యోగ విరమణచేసి 1976 నవంబరు 14 మానాయనమ్మ గారిపేరుతో శ్రీమతి అద్దంకి రాజ్యలక్ష్మమ్మ మెమోరియల్ ప్రియదర్శినీ బాలవిహార్ అనే  ఒక విద్యా సంస్ధను స్వంయంగా స్ధాపించారు. (మా నాయనమ్మగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసినవారే.) తరువాత చాలాకాలానికి మానాన్నగారు 1987లో ప్రీ-ప్రైమరీ పిల్లలకోసం తెలుగుబాల పేరుతో 3 పుస్తకాలు రూపొందించారు. పుస్తకాల పరిచయాన్ని టీచింగ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ ప్రీ-పైమరీ క్లాసెస్ అనే 7పేజీల వ్యాసంగా ఇంగ్లీషులో వ్రాసి 400 కాపీలు ప్రింట్ చేయించి ఢిల్లీ పంపించారుఆతర్వాత బొకే ఆఫ్ రైమ్స్ అండ్ పొయెమ్స్ అనే పేరుతో 1989లో మళ్ళీ ఒక చిన్నపుస్తకాన్ని ముద్రించారు. అంతే. ఆయన సాధారణంగా తాను పిల్లలకోసం రాసిన పుస్తకాల ముద్రణ కోసమే ప్రయత్నంచారు గాని ఇతర పుస్తకాల ముద్రణకోసం పెద్దగా ప్రయత్నించలేదు.
ఐతే ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆయన వ్రాసిన బుద్ధవిజయం అనే బుర్రకథకు జాతీయ బహుమతి రావడంతో అప్పుడు బుర్రకథను ముద్రిద్దామనే ప్రయత్నం చేసారు గాని కుదరలేదునేను డిగ్రీ చదువుతున్నప్పుడు 1979లో ఆయన వ్రాసిన ప్రీ-ప్రైమరీ పుస్తకాల ముద్రణ నిమిత్తం ఒకసారి ఢిల్లీ లోని గుప్తప్రకాశన్ పుస్తకాల కంపెనీకి వెళ్ళాము. ఆకంపెనీవారు ముద్రణ హక్కులు వారికిస్తే ముద్రిస్తామన్నారు. నాన్నగారు అందుకు అంగీకరించలేదు. ఇప్పటి వరకు పుస్తకాల ముద్రణ జరగలేదు. గత సంవత్సరం వాటిని ముద్రిద్దామనుకున్నాను కాని కుదరలేదు. బుద్ధునిపై రాసిన బుర్రకథకు 1960లో జాతీయబహుమతి వచ్చినపుడు మానాన్నగారిలో బౌద్ధం పట్ల  ఉత్సాహం రెట్టింపైంది. వెంటనే బుద్ధుని జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని సంపూర్ణ గౌతమ బుద్ధ చరిత్రను తథాగతీయము అనే పేరుతో ఒక నిర్వచన పద్యకావ్యాన్ని రాయడం మొదలుపెట్టి 28 సంవత్సరాలు కృషిచేసి 4088 పద్యాలతో పూర్తిచేసారు. ఐతే మహాగ్రంథ ముద్రణ కోసం కూడా మానాన్నగారు పెద్దగా ప్రయత్నించలేదు. మా రెండో అక్కయ్య రామప్రియ ప్రోద్బలంతో కుటుంబ సభ్యులమంతా తథాగతీయాన్ని 1997లో ముద్రించాం. తర్వాత మా రెండో అక్కయ్య 2000 సంవత్సరంలో మానాన్నగారు రాసిన లలిత సంగీత నృత్య గీత మాలిక రాధికా సాంత్వనము అనే పుస్తకాన్ని ముద్రించడమే కాకుండా అందులోని కొన్ని గీతాలను కేసెట్ రూపంలో కూడా  తీసుకువచ్చింది. ఆతర్వాత 2001లో నాన్నగారువ్రాసిన దేశభక్తి గీతాలను అందాల స్వర్గసీమ అనేపేరుతో నేను ముద్రించాను.
అప్పటికి మా నాన్నగారికి 83 సంవత్సరాలు. ఇంకా రచనా వ్యాసాంగం మానలేదు. అప్పుడు ఆయన వ్రాస్తున్న అచ్చతెనుగు పదాల నిఘంటువు పూర్తి కాకుండానే 88ఏళ్ళ వయస్సులో 2005 నవంబరు 22 తేది ఉదయం ఆయన నిర్యాణం చేసారు. మరణానికి ముందురోజు 21 తేది రాత్రి ఆయన చదువుతున్న పుస్తకం డాడి.ధమ్మానంద వ్రాసిన బుద్ధీజం ఫర్ ఫ్యూచర్మానాన్నగారు తన చిన్నతనంలో ప్రారంభించిన రచనావ్యాసాంగాన్ని, గ్రంథ పఠనాన్ని తాను మరణించే ముందురోజు రాత్రి వరకూ మానలేదు. మానాన్న గారితో బాటు మా అమ్మగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ  అన్నివిధాలా మానాన్నగారికి సహధర్మచారిణిగా భాసిల్లింది. ఇరువురూ తమ ఏడుగురు సంతానాన్ని అత్యంత ప్రేమపాత్రంగా పెంచారు. మా పెంపకం కోసమే మా నాన్నగారు తన రచనలను ముద్రించుకునే ప్రయత్నాన్ని ఎక్కువగా చేయలేదు. చేయలేకపోయారనాలిమానాన్నగారి సమకాలీకులు సకాలంలో ముద్రించుకున్న గ్రంథాలవల్ల లబ్దప్రతిష్టులైనవారు ఎందరో ఉన్నారు. ఐతే మానాన్నగారికి అదృష్టం దక్కలేదు. అంటే ఆమేరకు మేమూ దురదృష్టవంతులమే కదా!   ఆరోజుల్లో వాళ్ళిద్దరి సంపాదనతో మా ఏడుగుర్నీ చదివిస్తూ, మమ్మల్ని పెంచడమే చాలా కష్టం. అలాంటప్పుడు మా నాన్నగారు ఖర్చులు మానుకుని తన పుస్తకాలు ముద్రించుకుంటారు?
ఇంతకీ నాన్నగారు 1960లో ప్రచురిద్దామనుకున్న బుద్ధవిజయం బుర్రకథను ఆయన మరణానంతరం 2014లో కుటుంబసభ్యులమంతా కలిసి ముద్రించి  ఆయన చిరకాల కోరిక తీర్చాము. మానాన్నగారిలో ఉన్న అనేక విశిష్టతల నేపథ్యంలో ఆయన రచనల్లో ఈకాలానికి ఏకొద్దిగా పనికొస్తుందనిపించినా ముద్రిద్దామనే మాకనిపిస్తుంది. ఐతే ఎన్నని ముద్రించగలము. ఇంతవరకు ఏపుస్తకాన్ని ముద్రించినా విక్రయించి లాభపడదామని కాకుండా అన్నింటినీ ఉచితంగానే పంపిణీ చేసాము, చేస్తున్నాము. మానాన్నగారు మానాయనమ్మ గారి జ్ఞాపకార్థము స్థాపించిన విద్యాసంస్థను కూడా సాధ్యమైనంతవరకు వ్యాపార దృక్పధానికి అతీతంగానే నడుపుతున్నాం. మిత్రుడు వేణుగోపాల్ సలహాతో నాన్నగారి కోసం 'అనునయం' అనే పేరుతో బ్లాగును ప్రారంభిస్తున్నాము. నాన్నగారికి సంబంధిచినవన్నీ ఒక్కటొక్కటిగా  ఇందులో చేర్చాలని మా ఉద్దేశ్యం.


ఇట్లు - అద్దంకి బుద్ధచంద్రదేవ్ .

గమనిక: 2016లో 'అనునయం' పేరుతో ఈ బ్లాగును ప్రారంభించాము. అయితే ఆ తర్వాత నాన్న గారి పేరుతోనే ఈ బ్లాగు ఉంటే బాగుంటుందనిపించి 2020లో ఇలా మార్చాము. 

Comments